: పోలీసుల అదుపులో క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి
క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ (56) ను ఓ పార్కింగ్ వివాదంలో పంచ్ కుల (హర్యానా) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యోగ్ రాజ్ సోదరి కుటుంబం పొరుగు వ్యక్తితో పార్కింగ్ విషయమై గొడవపడింది. రాజీ కుదిర్చేందుకు వెళ్ళిన యువీ తండ్రి దురుసుగా ప్రవర్తించాడంటూ ఫిర్యాదు నమోదు కావడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ గొడవలో యోగ్ రాజ్ ఓ వ్యక్తిని గాయపర్చినట్టు తెలుస్తోంది. యువీ తండ్రికి పోలీసు అరెస్టులు కొత్తకాదు. 2000 సంవత్సరంలో చండీగఢ్ లో ఓ కారు ప్రమాదం కారణంగా ఆయన ఆరు నెలలు జైలులో గడపాల్సి వచ్చింది. యోగ్ రాజ్ సింగ్ మాజీ క్రికెటర్. భారత్ తరపున ఆయన పలు అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడారు. అప్పట్లో కపిల్ దేవ్ నీడలో యోగ్ రాజ్ పేస్ నైపుణ్యం మరుగునపడిపోయిందన్నది క్రికెట్ పండితుల అభిప్రాయం. కాగా, ఇటీవలే గొంతులో క్యాన్సర్ కణితికి అమెరికాలో ఆయన చికిత్స తీసుకుని వచ్చారు.