: 'పెద్ద మనసు'కు సిసలైన చిరునామా ఇదిగో!


హెచ్ఐవీ... ఓ ప్రాణాంతక వైరస్. ఈ ఎయిడ్స్ కారక వైరస్ బారిన పడితే అంతే సంగతులు. నివారణలేని ఈ వ్యాధితో ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది చనిపోయారు. ఇప్పుడైతే తగ్గుముఖం పట్టింది గానీ, దశాబ్దం కిందట దీని పేరు వింటేనే ప్రజలు హడలెత్తిపోయే పరిస్థితి! ఈ వ్యాధి సోకిన వ్యక్తులను కుటుంబ సభ్యులే వెలివేయడం వంటి సంఘటనలు చూశాం. కానీ, ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నగరానికి చెందిన అజయ్ శర్మ దంపతులు మాత్రం పెద్ద మనసుకు సిసలైన చిరునామాలా నిలిచారు. హెచ్ఐవీ సోకిన 12 మంది బాలురకు తమ ఇంట ఆశ్రయం కల్పించి, వారి జీవితాల్లో మళ్ళీ సంతోషం నింపేందుకు కృషి చేస్తున్నారు. ఈ చిన్నారుల తల్లిదండ్రులు సైతం ఇదే వ్యాధితో మరణించగా, అనాథలైన చిన్నారులను ఈ దంపతులు దత్తత తీసుకున్నారు. అజయ్ శర్మ 2004లో తీవ్ర బ్రెయిన్ హెమరేజ్ కారణంగా మరణం అంచుల వరకూ వెళ్ళి తిరిగివచ్చారు. 15 రోజులు కోమాలో ఉన్నారు. ఆ అనుభవంతో ఆయన జీవితం విలువను సరిగ్గా అంచనా వేయగలిగారు. అప్పుడే నిర్ణయించుకున్నారు, నిరుపేద బాలల కోసం జీవితాన్ని అంకితం చేయాలని! అనుకున్నదే తడవుగా ఎయిడ్స్ వ్యాధి పీడిత బాలలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో 12 మందిని దత్తత తీసుకుని వారి బాగోగులు చూడడం మొదలుపెట్టిన అజయ్ శర్మకు భార్య ఎంతగానో సహకరిస్తారు. తొలుత ఈ పిల్లలను ఉంచేందుకు ప్రత్యేక నివాసం కోసం వెదికే క్రమంలో స్థానికులు వ్యతిరేకత కనబర్చేవారట. బాధిత పిల్లల ద్వారా ఎయిడ్స్ వ్యాధి వ్యాపిస్తుందేమోనని వారు భయపడేవారని శర్మ చెప్పుకొచ్చారు. అయితే, తర్వాత్తర్వాత వారే సానుకూలంగా స్పందించారని తెలిపారు. కాగా, ప్రభుత్వ సాయం ఇంకా అందలేదని చెప్పారు. ఓ 50 మంది చిన్నారులు పట్టేంత ఇల్లు తీసుకుని, తమ 'సత్యకామ్ సేవాశ్రమ్' సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తానని చెబుతున్నాడీ నిస్వార్థ సేవకుడు!

  • Loading...

More Telugu News