: రాజధాని రైళ్లలో 'వర్క్ స్టేషన్లు'
ఈ ఏడాది ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో... మోడీ సర్కార్ ఆఫీస్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఒక రేల్వే కోచ్ లో... పూర్తిస్థాయి ఆఫీస్ సౌకర్యాలు కల్పించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమంపై ఓ అంచనాకి వచ్చేందుకు... రైల్వేశాఖ అతి త్వరలో ఓ పైలట్ ప్రాజెక్ట్ ను ఆరంభించనుంది. దీనిలో భాగంగా దక్షిణాదికి చెందిన రాజధాని రైళ్లలోని పాంట్రీకార్లలో 'వర్క్ స్టేషన్లు' ప్రారంభించనుంది. ఈ వర్క్ స్టేషన్లలో ఓ హై క్లాస్ ఆఫీస్ లో ఉండే అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. ల్యాప్ టాప్, ఇంటర్ నెట్, ప్రింటర్, ఫాక్స్ తదితర ఆఫీస్ సదుపాయాలు వీటిలో కల్పించనున్నారు. వీటిని వినియోగించుకోవాలనుకునేవారు ముందుగా కొంత రుసుము చెల్లించి వాడుకోవచ్చు. ఈ రుసుము గంటల లెక్కన రైల్వేశాఖ వసూలు చేయనుంది. రాజధాని రైళ్లలో ఈ వర్క్ స్టేషన్లకు వచ్చే స్పందనను బట్టి... ఆఫీస్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో (అంటే అన్ని ముఖ్యమైన రైళ్లోలో ఒక కోచ్ ను పూర్తి స్థాయి ఆఫీస్ గా మార్చే కార్యక్రమం) అమలు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఆఫీస్ ఆన్ వీల్స్ కార్యక్రమం అమల్లోకి వస్తే...రైళ్లల్లో ప్రయాణిస్తూనే తమ ఆఫీసు పనులను, బిజెనెస్ పనులను ప్రయాణికులు చక్కబెట్టుకోవచ్చు. ప్రతీ క్షణం అత్యంత విలువైనదిగా భావించే బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ కు, ప్రభుత్వ...ప్రైవేటు సెక్టార్లలో ఉన్న ఉన్నతస్థాయి ఉద్యోగులకు ఈ కార్యక్రమం వరం లాంటిదని రైల్వేశాఖ అభిప్రాయపడుతోంది.