: సచిన్ కు 'చల్లచల్లని' సవాల్ విసిరిన హాకీ కెప్టెన్
సదుద్దేశంతో ప్రారంభమైన ఐస్ బకెట్ చాలెంజ్ లో భారత సెలబ్రిటీలు విరివిగా పాల్గొంటున్నారు. తాజాగా, ఈ చాలెంజ్ స్వీకరించి విజయవంతంగా ఐస్ బకెట్ స్నానం చేసిన భారత హాకీ కెప్టెన్ సర్దారా సింగ్, తదుపరి, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కు సవాల్ విసిరాడు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ఈ చాలెంజ్ లో పాల్గొన్న సర్దార్జీ... సచిన్ తోపాటు, బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహాం, నెదర్లాండ్స్ హాకీ మాజీ సారథి ట్యూస్ డి న్యూర్ కు కూడా సవాల్ విసరడం విశేషం. డచ్ హాకీ జట్టు గోల్ కీపర్ జా స్టాక్ మన్ సవాల్ స్వీకరించిన ఈ పంజాబీ యోధుడు ఐస్ బకెట్ స్నానం చేశాడు. సర్దారాతో పాటు భారత హాకీ జట్టు కూడా ఈ చాలెంజ్ లో పాల్గొంది. అనంతరం వారు భారత మహిళల క్రికెట్ జట్టుకు, మహిళల హాకీ జట్టుకు, ఆసీస్ పురుషుల హాకీ జట్టుకు సవాల్ విసిరారు. నాడీ సంబంధ వ్యాధి పట్ల చైతన్యం, బాధితులకు సాయం కోసం నిధుల సేకరణ వంటి అంశాలపై ఏఎల్ఎస్ అనే సంస్థ ఈ ఐస్ బకెట్ చాలెంజ్ నిర్వహిస్తోంది.