: విరాట్-అనుష్కల లవ్ ఎపిసోడ్ తో కళ్లు తెరిచిన బీసీసీఐ... గర్లఫ్రెండ్స్, భార్యలకు నోఎంట్రీ
ఇంగ్లండ్ సిరీస్ లో టీమిండియా ఘోర ఓటమి బీసీసీఐ కళ్లు తెరిపించింది. ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఆటగాళ్లతో పాటు వారి భార్యలకు, గర్ల్ ఫ్రెండ్స్ కు అనుమతి ఇవ్వడంపై బీసీసీఐపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీలకమైన ఇంగ్లండ్ సిరీస్ లో ఆటపై దృష్టి సారించకుండా... ప్రియురాళ్లు, భార్యలతో కలిసి చెట్టాపట్టాలు వేసుకుని ఆటగాళ్లు ఎంజాయ్ చేయడం బీసీసీఐ ఆలోచనా ధోరణిని మార్చేసింది. ముఖ్యంగా కీలకమైన ఐదో టెస్ట్ మ్యాచ్ ముందు కెప్టెన్ ధోనితో సహా మిగతా క్రికెటర్లు... పబ్ కు వెళ్లి ఎంజాయ్ చేయడం బీసీసీఐను కలవరపాటుకు గురిచేసింది. ఇటీవల జరిగిన బీసీసీఐ సమావేశంలో, బోర్డు సభ్యులు సైతం క్రికెటర్లు ఆటపై ఫోకస్ చేయకుండా భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ తో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా ధోని తర్వాత కెప్టెన్ గా పట్టాభిషేకానికి రెడీ అయిన విరాట్ కోహ్లితో అనుష్కశర్మ ప్రేమ వ్యవహారం బీసీసీఐకి తలబొప్పి కట్టేలా చేసింది. ప్రతి సిరీస్ లో పులిలా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే విరాట్... ఈ సిరీస్ లో పిల్లిలా మారిపోయాడు. చేసిన తప్పులే చేస్తూ... కెరీర్ లోనే తొలిసారి అతి పేలవమైన ఫామ్ ను ప్రదర్శించాడు. కీలకమైన విదేశీ టూర్ లో ఆటను గాలికొదిలేసి... అనుష్క శర్మతో ప్రేమలో మునిగితేలడం విమర్శలకు దారి తీస్తోంది. ఈ విషయంలో అందరూ విరాట్ కోహ్లీని ఎంతగా తప్పుబడుతున్నారో... బీసీసీఐను అంతకన్నా ఎక్కువగానే తప్పుబడుతున్నారు. దీంతో జరిగిన పొరపాటును దిద్దుకోవడానికి... ఇకపై విదేశీ టూర్లలో క్రికెటర్ల గర్ల్ ఫ్రెండ్స్, భార్యలను అనుమతించకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. త్వరలో అధికారికంగా తన నిర్ణయాన్ని కూడా ప్రకటించనుంది.