: యోగా గురువు మృతికి సంతాపం తెలిపిన సచిన్
ప్రముఖ యోగా గురు బీకేఎస్ అయ్యంగార్ మృతి పట్ల భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సంతాపం ప్రకటించారు. అయ్యంగార్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ పుణేలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం నాడు కన్నుమూశారు. తన సుదీర్ఘమైన కెరీర్ కు అయ్యంగార్ ఆసనాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఈ సందర్భంగా సచిన్ గుర్తు చేసుకున్నారు. సచిన్ తన సంతాప సందేశంలో... అయ్యంగార్ ను తాను 1999లో మొదటిసారి కలిశానని, ఆయనను కిరణ్ మోరే తనకు పరిచయం చేశారని చెప్పారు. తాను గాయపడినప్పుడు ఆయన ఆసనాలు ఎంతగానో ఉపయోగపడేవని సచిన్ తెలిపారు. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరమని సచిన్ పేర్కొన్నారు.