: మంత్రి గేదెల సేవలో యూపీ పోలీసుల తన్మయత్వం!


అజాం ఖాన్. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కేబినెట్ లో సీనియర్ మంత్రి. అదేనండి, తన కుక్క కనబడలేదనగానే, పోలీసులను పరుగులు పెట్టించారు చూడండి... గుర్తుందా... ఆయనే! మరోమారు వార్తల్లో నిలిచారు. ఈసారి కుక్క తప్పిపోలేదు. కాని గేదెలు కొనుగోలు చేశారు. అదేంటి, గేదెలు కొనుగోలు చేస్తేనే వార్తల్లోకి ఎక్కుతారా? అని ఆశ్చర్యపోకండి. ఆయన కొన్న గేదెలకు యూపీ పోలీసులు అసాధారణ రీతిలో సేవలు చేసి తమ స్వామి భక్తిని చాటుకున్నారు. గేదెలకు సేవలా? అనేగా సందేహం. అవి ఘనత వహించిన మంత్రి అజాం ఖాన్ వి మరి. ఈ దృశ్యం కనిపించింది ఎక్కడో తెలుసా? నిన్నటిదాకా అల్లర్లతో అట్టుడికిన సహరాన్ పూర్ లో. అల్లర్ల సందర్భంగా చేతులు ముడుచుకుని కూర్చున్నా, మంత్రిగారి గేదెల సేవలో మాత్రం యూపీ పోలీసులు మా బాగా తరించారు. అసలు విషయమేంటంటే, అజాం ఖాన్, పంజాబ్ లో ఓ ఐదు గేదెలను కొనుగోలు చేశారు. పంజాబ్ నుంచి గేదెలను తరలించిన వాహనం హర్యానా మీదుగా సహరాన్ పూర్ చేరుకుంది. నేరుగా గాగలేది పోలీస్ స్టేషన్ ముందు నిలిచింది. అంతే, ఒక్కసారిగా అక్కడి పోలీసులు ఆ వాహనం వద్దకు పరుగులు పెట్టారు. గేదెల నోటికి తాజా రోటీలను అందించారు. బెల్లం కూరిన ఖరీదైన దాణాను గేదెలకు అందించారు. అంతేనా, గేదెలను దోమల బారి నుంచి రక్షించేందుకు ఏకంగా చిన్నపాటి చలిమంటనే ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే, మంత్రి గారి గేదెలను సహరాన్ పూర్ దాకా తరలించిన వాహనానికి ఓ జీపులో పోలీసులు ఎస్కార్ట్ గానూ అనుసరించారట. ఎంతైనా మంత్రి అజాం ఖాన్ గేదెలు కదా. అయితే గేదెలకు సేవలు చేసింది యూపీ పోలీసులు కాదని, పంజాబ్ పోలీసులని సహరాన్ పూర్ పరిధిలో పనిచేస్తున్న ఓ పోలీసు అధికారి చెప్పడం గమనార్హం.

  • Loading...

More Telugu News