: మహిళపై పదిమంది సామూహిక అత్యాచారం
అరాచకాల ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. కుల వివక్షకు పరాకాష్ఠగా నిలిచిన ఈ సంఘటన మానవత్వానికే మాయని మచ్చగా నిలుస్తోంది. భర్తను, కొడుకును కట్టేసి మరీ కామాంధులు దారుణానికి తెగబడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని బారేలోని కంటోన్మెంట్ ప్రాంతంలో పొలం పనులు ముగించుకుని ఇంటికి తిరిగివస్తున్న 40 ఏళ్ల దళిత మహిళను ఎత్తుకెళ్లి పది మంది దుర్మార్గులు సామూహిక అత్యాచారం చేశారు. ఆమె భర్త, కొడుకును దగ్గర్లోని చెట్టుకు కట్టేసి వారీ దారుణానికి ఒడిగట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాధితురాలి బంధువులపై కూడా దుండగులు దాడి చేశారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితులు పలుకుబడి కలిగిన అగ్రకులాలకు చెందినవారు కావడంతో కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో వారు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్పీ దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేయడంలో అలసత్వం ప్రదర్శించిన పోలీసులపైనా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.