: తెలంగాణ కోసం తొలుత తీర్మానం చేసింది బీజేపీయే: అమిత్ షా
తెలంగాణ కోసం తొలుత తీర్మానం చేసింది బీజేపీయేనని అమిత్ షా చెప్పారు. తెలంగాణ కోసం మొదట నుంచి కృషి చేసింది బీజేపీయేనని ఆయన అన్నారు. సికింద్రాబాదులోని ఇంపీరియల్ గార్డెన్స్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గ్రేటర్ హైదరాబాదు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనను పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బీజం వేసింది నాటి ఎన్డీయే ప్రభుత్వమేనని ఈ సందర్భంగా అమిత్ షా గుర్తు చేశారు. గతంలో మూడు రాష్ట్రాలను బీజేపీ ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలసిమెలసి అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ రాజకీయాలతో రాష్ట్ర విభజనలో లోపాలు తలెత్తాయని ఆయన చెప్పారు. పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. ప్రస్తుత తరుణంలో దేశాన్ని రక్షించేది మోడీ నేతృత్వంలోని బీజేపీయేనని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని దక్షిణాదికి విస్తరింపజేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.