: నా వల్ల ఫ్లెచర్ కేమీ ముప్పుండదు: రవిశాస్త్రి


టీమిండియా కోచింగ్ డైరక్టర్ గా నియమితుడైన మాజీ కెప్టెన్ రవిశాస్త్రి క్రికిన్ఫో వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు వెల్లడించారు. తన నియాయకం నేపథ్యంలో ప్రస్తుత కోచ్ డంకన్ ఫ్లెచర్ స్థాయి ఏమీ తగ్గదని, ప్రధాన కోచ్ ఆయనేనని ఉద్ఘాటించారు. అయితే, ఫ్లెచర్ సహా జట్టులోని ప్రతి ఒక్కరూ తనకే రిపోర్టు చేయాలని శాస్త్రి తనకప్పగించిన బాధ్యతలను చెప్పకనే చెప్పారు. ఇంగ్లండుతో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియాకు చెందిన ప్రతి అంశాన్ని పర్యవేక్షించడం తన విధి అని ఆయన తెలిపారు. "ఫ్లెచర్ హెడ్ కోచ్ గానే ఉంటారు. సంజయ్ బంగర్, బి.అరుణ్ లు అతనికి సహాయకులుగా వ్యవహరిస్తారు" అని రవి వివరించారు. తనకప్పగించిన బాధ్యత కష్టమైనదా?, సులువైనదా? అన్న విషయం తాను ఆలోచించడం లేదని, జట్టుకు తోడ్పాటునందివ్వడంపైనే తన దృష్టి అని ఆయన పేర్కొన్నారు. "నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే అది బీసీసీఐ చలవే. జూనియర్ లెవెల్ నుంచి రాష్ట్ర, జాతీయ జట్టు దాకా ఎదగడానికి బోర్డు బాటలు పరిచింది. ఇప్పుడు ఇలా వారి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని భావిస్తున్నాను" అని రవిశాస్త్రి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News