: బిట్స్ పిలానీ విద్యార్థులకు గూగుల్ రూ. 1.40 కోట్ల వేతనం ఆఫర్!
గూగుల్ లో పనిచేసేందుకు ఎంపికైతే చాలు, బిట్స్ పిలానీ విద్యార్థులు కోటీశ్వరులైనట్లే లెక్క. ఎందుకంటే, తమ ఇంటర్వ్యూలో గట్టెక్కిన బిట్స్ పిలానీ విద్యార్థులకు రూ.1.40 కోట్ల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేస్తోంది గూగుల్. అంటే, తమ క్యాంపస్ లో గూగుల్ ఇంటర్వ్యూను బిట్స్ పిలానీ విద్యార్థులు గట్టెక్కితే చాలన్నమాట. రూ.1.40 కోట్ల కంటే పైగానే వేతనం దక్కుతుంది. అంతకు ఒక్క రూపాయి కూడా తగ్గదన్న మాట. గూగుల్ భారీ ఆఫర్ నేపథ్యంలో బిట్స్ పిలానీ విద్యార్థులు భారీ వేతనాల ఆఫర్లకు సంబంధించి గతేడాది రికార్డులను తిరగరాయనున్నారు. గతేడాది క్యాంపస్ సెలెక్షన్స్ లో బిట్స్ పిలానీకి చెందిన ఓ విద్యార్థికి వార్షిక వేతనం కింద రూ. 1.44 కోట్లను ఫేస్ బుక్ ఆఫర్ చేసింది. తాజాగా గూగుల్, తాను ఎంపిక చేసుకునే బిట్స్ పిలానీకి చెందిన ప్రతి విద్యార్థికి రూ.1.40 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో, గతేడాది రికార్డు ఆఫర్ గల్లంతు కావడం ఖాయమేనని విద్యాలయం ప్లేస్ మెంట్స్ సెల్ విభాగాధిపతి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ నెల 18న గూగుల్ నిర్వహించిన తొలి విడత సెలెక్షన్స్ కు బిట్స్ పిలానీకి చెందిన విద్యార్థులు చాలా మందే హాజరయ్యారు. వారిలో చాలా మంది గూగుల్ లో ఉద్యోగాలకు ఎంపికవుతారని బాల సుబ్రహ్మణ్యం విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.