: పీపీఎఫ్ లో ఇప్పుడు మరింత పొదుపు చేసుకోవచ్చు
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లో ఇప్పుడు మరింత పొదుపు చేసుకొనే సౌలభ్యాన్ని కేంద్రం కల్పించింది. ఇప్పటివరకు ఈ పథకం కింద సంవత్సరానికి లక్ష రూపాయల వరకు పొదుపు చేసుకునే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా, పీపీఎఫ్ లో మదుపు చేసుకునే పరిమితిని లక్షా 50 వేల రూపాయలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. పీపీఎఫ్ ఖాతా 15 సంవత్సరాల వ్యవధి ఉంటుంది. పీపీఎఫ్ ఖాతా తెరవాలనుకుంటున్నారా? ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులో కానీ, పోస్టాఫీసులో కానీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు. నెలలో కనిష్ఠంగా 500 రూపాయల నుంచి పొదుపు చేసుకోవచ్చు. గరిష్ఠంగా సంవత్సరానికి లక్షా 50 వేల రూపాయల వరకు మదుపు చేసుకునే వీలుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం ఒక్కసారి జమ చేసి కూడా ఈ ఖాతాను కొనసాగించవచ్చు. అంటే, మీరు ఒక సంవత్సరంలో వెయ్యి రూపాయలు జమ చేసి ఈ పథకాన్ని కంటిన్యూ చేయవచ్చు. అలాగే ఒకేసారి లక్ష రూపాయలను కూడా ఈ ఖాతాలో జమ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది.