: ధర్మరాజు తల్లినే శపించాడా..?


మహాభారతం ఓ సినిమా అనుకుంటే కురుక్షేత్ర మహా సంగ్రామం దానికి క్లైమాక్స్! 18 రోజుల పాటు సాగిన ఈ భీకరయుద్ధం ధుర్యోధనాదులు హతమవడంతో ముగిసింది. కౌరవ వధ జరిగింది, రాజ్యం దక్కింది... కానీ, సంతోషించాల్సిన ధర్మరాజు కాస్తా తీవ్ర విచారంలో మునిగిపోయాడు. గంగానదీ తీరంలో ఉన్న ఈ పాండురాజు తనయుడి వద్దకు త్రిలోక సంచారి నారద మహాముని వచ్చి, "ఏమిటి, యుధిష్టరా... ఎందుకు విచారిస్తున్నావు?" అని ప్రశ్నించగా, అప్పుడు ధర్మనందనుడు ఇలా బదులిస్తాడు. "ఈ సంగ్రామంలో చనిపోయిన వారందరూ ఎవరు నారద మునీంద్రా, అందరూ నా బంధువులే కదా? అభిమన్యుడు, ద్రౌపది కుమారులు అమరులయ్యారు. ముఖ్యంగా నా అన్న కర్ణుడి చావును జీర్ణించుకోలేకున్నాను. ఎందరో నేలకొరిగిన తదుపరి కర్ణుడు నా అన్న అని తెలుసుకున్నాను. అసలు యుద్ధ సమయంలో అతడి రథ చక్రాలు ఎందుకు కుంగిపోవాల్సి వచ్చింది? ఎందుకతడి కవచ కుండలాలు ఆపదలో అక్కరకు రాకుండా పోయాయి? నా సోదరుడు ఎందుకు శాపగ్రస్తుడయ్యాడు?" అంటూ ఆవేదనా భరితుడవుతాడు. ఇంతలో తల్లి కుంతి అక్కడికి వస్తుంది. "బాధపడవద్దు నాయనా, యుద్ధం ముందే కర్ణుడికి చెప్పాను, మీతో బంధుత్వం గురించి. శత్రుత్వాన్ని వీడమని ఉద్బోధించాను. సూర్య భగవానుడు కూడా చెప్పి చూశాడు. కానీ, ధుర్యోధనుడితో మైత్రి అతడిని యుద్ధోన్ముఖుడిని చేసింది" అని కుంతీమాత కుమారుణ్ణి ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. అయితే, ఆ ఊరడింపు వచనాలు ధర్మరాజులో మరింత ఆవేశాన్ని రగిలించాయి. తన తల్లి కర్ణుడి జన్మ రహస్యాన్ని చాలాకాలం దాచబట్టే ఇంత దారుణం జరిగిందని మరింతగా ఆగ్రహం చెందాడు. వెంటనే "ఇకపై ఏ మహిళా రహస్యాన్ని దాయలేదు" అని శపించాడు. మహిళాజాతి అంతటికీ ఇది వర్తిస్తుంది అని పేర్కొన్నాడు. ఇప్పటికీ మనం వింటూ ఉంటూం, ఆడవారి నోట్లో ఆవగింజ అయినా దాగదని. ఆ సామెత ఇక్కడి నుంచే మొదలైందట!

  • Loading...

More Telugu News