: బ్యాంకు రుణాన్ని విదేశాలకు తరలించిన విన్ సమ్ గ్రూప్?


వ్యాపార నిమిత్తం పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల వద్ద తీసుకున్న భారీ రుణాన్ని విదేశాలకు తరలించినట్లు విన్ సమ్ గ్రూప్ పై దర్యాప్తు సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. బంగారం, వజ్రాల వ్యాపారంలో ఉన్న విన్ సమ్, 15 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులతో కూడిన కన్సార్టియం నుంచి రూ. 6,581 కోట్ల మేర రుణాన్ని తీసుకుంది. అయితే రుణ వాయిదాలు చెల్లించడంలో విఫలమైంది. దీంతో పలుమార్లు నోటీసులు జారీ చేసిన బ్యాంకుల కన్సార్టియం, విన్ సమ్ గ్రూపును ఎగవేతదారుగా ప్రకటించింది. అంతేకాక ఆ సంస్థ తీసుకున్న రుణాన్ని నిరర్థక ఆస్తుల కింద జమ చేసింది. విదేశాల్లోని తమ సరఫరాదారులు, భారీ నష్టాలు చవిచూసిన నేపథ్యంలో వారి నుంచి తమకు బకాయిలు వసూలు కాలేదని చెప్పిన విన్ సమ్, రుణ వాయిదాలను చెల్లించేందుకు తమ వద్ద నిధులు లేవని వెల్లడించింది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని ఉద్దేశపూర్వకంగానే విన్ సమ్, గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు తరలించిందని తెలుస్తోంది. విదేశాల్లో విన్ సమ్ కు 13 మంది సరఫరాదారులు ఉండగా, వాటిలో 12 సంస్థలు ఒకే యాజమాన్యం కింద పనిచేస్తున్నవే కావడం గమనార్హం. అంతేకాక సదరు సంస్థలకు నష్టాలు వచ్చినట్లుగా దాఖలాలు కూడా లేవని కూడా సమాచారం. ఈ నేపథ్యంలో విన్ సమ్ పై దర్యాప్తు సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టేందుకు రంగం సిద్ధమవుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. భారీ రుణాన్ని ఎగవేసి, కింగ్ ఫిషర్ తర్వాత అత్యధిక మొత్తం రుణం ఎగవేసిన సంస్థగా విన్ సమ్ బ్యాంకుల రికార్డులకెక్కింది.

  • Loading...

More Telugu News