: సెన్సార్ బోర్డు సీఈఓ అరెస్టుతో చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు
సినిమాలకు క్లియరెన్స్ సర్టిఫికెట్ల జారీలో ముడుపులు స్వీకరించారన్న ఆరోపణలపై అరెస్టయిన సెన్సార్ బోర్డు సీఈఓ రాకేశ్ కుమార్ ఉదంతం దేశవ్యాప్తంగా చలనచిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. తాము నిర్మించిన చిత్రాలకు ఎలాంటి కత్తెరలు పడకుండా ఉండేందుకు ఆయా చిత్ర నిర్మాతలు సెన్సార్ బోర్డు సభ్యులకు ముడుపులు చెల్లిస్తారన్న ఆరోపణలు అటు బాలీవుడ్ తో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లోని చలనచిత్ర రంగాలను వణికించింది. ఛత్తీస్ గఢ్ కు చెందిన ఓ చిత్రానికి అనుమతి మంజూరు చేసేందుకు రాకేశ్ శర్మ రూ.70 వేలు డిమాండ్ చేశారు. తాను నియమించుకున్న ఇద్దరు మధ్యవర్తుల ద్వారా రాకేశ్ ఈ అవినీతి తంతుకు తెరతీశారు. దీనిపై ఫిర్యాదునందుకున్న సీబీఐ మధ్యవర్తులిద్దరినీ అదుపులోకి తీసుకుంది. విచారణలో వారు వెల్లడించిన విషయాలతో గత వారమే రాకేశ్ ఇంటిలో సీబీఐ సోదాలు నిర్వహించింది. అవినీతి ఆరోపణలు రుజువైన నేపథ్యంలో రాకేశ్ ను సోమవారం సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ సందర్భంగా సీబీఐ అధికారులు పలు ఆసక్తికర అంశాలను వెలికితీశారు. సీబీఐ విచారణలో భాగంగా పలువురు బాలీవుడ్ చిత్ర నిర్మాతలు కూడా తనకు లంచాలు ఇచ్చారని రాకేశ్ వెల్లడించినట్లు సమాచారం. ఐటం సాంగులతో రూపొందే చిత్రాలను చూసీచూడనట్లు వదిలేస్తున్న సెన్సార్ బోర్డు అధికారులు లంచాలు లేకుండానే అలా ఎందుకు వదిలేస్తారని కూడా సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ అగ్ర హీరోలతో రూపొందిన పలు చిత్రాల అనుమతి కోసం సదరు చిత్రాల నిర్మాతలు ముడుపులు ముట్టజెప్పినట్లు పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించాయని తెలుస్తోంది. దీంతో ఈ దిశగానూ సీబీఐ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు రంగంలోకి దిగారు.