: సభ మర్యాదలకు భంగం కలిగితే కఠిన చర్యలు తీసుకుంటాం: కోడెల
శాసనసభ ముగిసిన అనంతరం శాసన సభ్యుల మధ్య అవాంఛనీయ సంఘటన జరిగిందని తెలిసిందని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సభలో అవాంఛనీయ సంఘటనలు జరిగి, సభ మర్యాదలకు భంగం వాటిల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త శాసన సభ్యులుకు అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. నిన్న, నేడు సభా సమయంలో అజెండా పూర్తి చేయలేకపోయామని ఆయన వెల్లడించారు. సభలో అన్ని పక్షాలు సహకరిస్తేనే విజయవంతంగా సమావేశాలు జరుగుతాయని ఆయన తెలిపారు. ప్రతిపక్షం అంటే విమర్శలే కాదు, నిర్మాణాత్మక సలహాలు కూడా ఇవ్వవచ్చని ఆయన తెలిపారు. సభా మర్యాదలకు భంగం కలుగకుండా శాసన సభ్యులు నడుచుకోవాలని ఆయన సూచించారు.