: గర్భిణీలు పొగ తాగుతున్నారా?...పిల్లలే కాదు, మనవళ్లు కూడా బాధితులవుతారట!
'పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్' అన్నాడు గిరీశం మహాశయుడు 'కన్యాశుల్కం'లో. ఇది బాగా ఒంట పట్టించుకున్నారేమో, మహిళలు కూడా పొగ తాగడంలో పోటీ పడుతున్నారు. మహిళలు గుప్పుగుప్పున సిగిరెట్ల పొగ వదులుతూ స్టేటస్ ఫీలవుతున్నారని సర్వేలు వెల్లడించాయి. పబ్బుల్లో, క్లబ్బుల్లో రింగురింగుల పొగలకు లింగ భేదాలు లేవంటారు. మహిళలు పొగతాగితే ప్రమాదమని ఎన్నో పరిశోధనలు తెలిపాయి. తాజాగా ఓ పరిశోధన గర్భిణీలు పొగతాగితే వారి పిల్లలతో పాటు మనవరాండ్రకూ హాని జరుగుతుందని తెలిపాయి. గర్భిణీల పిల్లలకు పొగతాగే అలవాటు లేకపోయినా... వారికి పుట్టే పిల్లలకు మామ్మ తాగిన పొగ హాని చేకూరుస్తుందని వెల్లడైంది. మహిళలు గర్భిణీలుగా ఉన్న సమయంలో పొగతాగితే కచ్చితంగా వారి మనవరాండ్ర జీవితంపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వారు ఎముకలు, కండరాలు సంబంధిత వ్యాధుల బారిన పడి కుచించుకుపోయే అవకాశం ఉందని తెలిపారు. మగ పిల్లలు యవ్వన దశ చేరేసరికి దీని ప్రభావం కచ్చితంగా కనబడుతుందని శాస్త్రవేత్తలు వివరించారు. వారి కండరాలు పెరగాల్సిన దానికంటే మరింత ఎక్కువ పెరిగి దుష్ప్రభావాలు బయటపడతాయని చెప్పారు. బాలికలైతే పెరగాల్సిన ఎత్తుతో పాటు, బరువులో తీవ్రమైన వ్యత్యాసం వస్తుందని పరిశోధకులు వెల్లడించారు. కనుక పొగ తాగడానికి ఎంత దూరం ఉంటే అంతమంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.