: నకిలీ విత్తనాలపై వైకాపా ఆందోళన
నకిలీ విత్తనాలతో రైతన్నలు మునిగిపోతున్నారని వైకాపా మంగళవారం నాటి శాసన సభ సమావేశాల్లో ఆందోళన వ్యక్తం చేసింది. శాసన సభ రెండో రోజు సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో నకిలీ విత్తనాలపై వ్యవసాయ శాఖ మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని వైకాపా సభ్యుడు గొట్టిపాటి రవికుమార్ పలు అనుబంధ ప్రశ్నలను సంధించారు. గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్న వ్యాపారులు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారని, వారి నుంచి కొనుగోలు చేసిన విత్తనాలతో రైతులు నష్టాలను చవి చూస్తున్నారని ఆరోపించారు. అంతేకాక గోదాముల్లో నెలల తరబడి నిల్వ ఉంటున్న విత్తనాలను రైతులకు పంపిణీ చేయడంపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మంచి పంటలు పండించిన రైతుల నుంచి విత్తనాలను సేకరించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని, దీంతోనే సాగులో నానాటికీ దిగుబడులు తగ్గిపోతున్నాయని రవికుమార్ అభిప్రాయపడ్డారు.