: స్వాతంత్ర్య దినోత్సవాన దేశ రాజధానిలో మహిళపై సామూహిక అత్యాచారం
ఆగస్టు 15 రాత్రి. దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మునిగిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి చేసిన ఉద్వేగభరిత ప్రసంగంపై తన్మయత్వంలో తేలియాడుతోంది. అదే సమయంలో రోగాన పడ్డ తమ కుటుంబ సభ్యురాలికి చికిత్స అందించేందుకు వచ్చిన ఓ మహిళా నర్సుపై ఇద్దరు క్రూరులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అదీ దేశ రాజధాని ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్ ఒబెరాయ్ లో. మృగాళ్ల దాడితో భీతిల్లిన 27 ఏళ్ల బాధితురాలు, ఏం చేయాలో పాలుపోక తనలో తానే కుమిలిపోయింది. బాధితురాలి మౌనాన్ని అవకాశంగా తీసుకున్న నిందితులు, మరోమారు ఆమెపై తమ వికృత నైజాన్ని చాటేందుకు యత్నించారు. కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నీరజ్, రాజన్ అనే ఇద్దరు యువకుల బంధువైన ఓ మహిళ అనారోగ్యం బారిన పడింది. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో ఉంటూ ఆమె చికిత్స తీసుకుంటున్నారు. ఆమెకు సహాయకులుగా ఉండేందుకు ఈ ఇద్దరు యువకులు కూడా అక్కడే ఉంటున్నారు. వ్యాధిగ్రస్తురాలికి వైద్య సహాయం కోసం ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల మహిళ నియమితులయ్యారు. ఆగస్టు 15 రాత్రి నర్సుపై నిందితులిద్దరూ రోగి ఉంటున్న గదిలోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాక విషయాన్ని బయటకు చెబితే, ఉద్యోగం ఊడగొడతామంటూ బెదిరించారు. దీంతో బాధితురాలు అయోమయంలో కూరుకుపోయారు. తిరిగి ఆదివారం రాత్రి కూడా నిందితులు బాధితురాలిపై అఘాయిత్యం చేసేందుకు యత్నించారు. ఇక లాభం లేదనుకున్న నర్సు, తన భర్త ద్వారా పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదునందుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించారు.