: హృద్రోగంతో బాధపడుతున్న 'వికీలీక్స్' అసాంజే!
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే హృదయసంబంధ వ్యాధితో బాధపడుతున్నట్టు గుర్తించామని లండన్ లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయం స్పష్టం చేసింది. గుండెజబ్బుతోపాటు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి కూడా అసాంజేను వేధిస్తోందని తెలిపింది. 43 ఏళ్ళ అసాంజే అమెరికాతో పాటు పలు దేశాలకు చెందిన రహస్య సమాచారాన్ని తన వికీలీక్స్ వెబ్ సైట్లో బట్టబయలు చేయడం తెలిసిందేే. దీంతో, అతనిపై ఎన్నో అరెస్టు వారంట్లు జారీ అయ్యాయి. ఈ కారణంగా అసాంజే ఈక్వెడార్ ను శరణు కోరగా, 2012 ఆగస్టులో ఈ లాటిన్ అమెరికా దేశం లండన్ లోని తన దౌత్య కార్యాలయంలో ఆశ్రయం కల్పించింది. అప్పటినుంచి అసాంజే ఆ కార్యాలయంలో లోపలే ఉంటున్నారు. గత రెండేళ్ళుగా పూర్తి సమయం ఏసీలోనే ఉంటుండడంతో అరిత్మియా (అస్తవ్యస్త హృదయస్పందన), దీర్ఘకాలిక దగ్గు, హైబీపీతో బాధపడుతున్నాడట. సూర్యరశ్మి సోకని కారణంగా విటమిన్ డి అందకపోవడంతో ఆస్త్మా, డయాబెటిస్, ఎముకలు పెళుసుబారిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందని ఈక్వెడార్ దౌత్య కార్యాలయ వర్గాలు తెలిపాయి. చివరికి డిమెన్షియాకు కూడా దారితీసే అవకాశం ఉందని అంటున్నారు. అసాంజేను ఆసుపత్రికి తరలించే విషయమై ఈక్వెడార్ ఎంబసీ బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యాలయాన్నిఅనుమతి కోరినా, ఇంతవరకు స్పందనలేదట.