: భూమి ఇస్తే సరిపోతుందా?...నీరివ్వాలి: జీవన్ రెడ్డి
దళితులను తెలంగాణ ప్రభుత్వం మభ్యపెట్టకూడదని సీఎల్పీ ఉపనేత టి.జీవన్ రెడ్డి సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, దళితులకు భూమి ఇస్తే సరిపోతుందా? సాగు చేసుకోవడానికి నీరెవరిస్తారని ప్రశ్నించారు. భూమి ఇవ్వడంతోనే ప్రభుత్వం చేతులు దులుపుకోకుండా, వ్యవసాయం చేసుకునేందుకు తగిన సౌకర్యాలు కల్పించాలని అన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని పార్టీలన్నీ చెప్పాయన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రభుత్వం కొందరికి మాత్రమే భూములు పంపిణీ చేస్తోందని జీవన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ వ్యాప్తంగా భూమిలేని దళిత కుటుంబాలు 8 లక్షలు ఉన్నాయని తెలిపారు. వారందరికీ భూమి ఇవ్వాలంటే ప్రభుత్వం 24 లక్షల ఎకరాలు సేకరించాలని, దానికి లక్షా 20 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఆయన తెలిపారు. అందుకే ప్రభుత్వం దళితులను మభ్యపెట్టకుండా చిత్తశుద్ధితో ఆదుకోవాలని జీవన్‌రెడ్డి కోరారు.