: రాజధానిగా విజయవాడ సురక్షితమేనా? భూకంపంతో రేగిన అనుమానం
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడ, గుంటూరు సరైన ఎంపికేనా? అనే అనుమానాలు రాష్ట్ర ప్రజల్లో బలపడుతున్నాయి. విజయవాడ, గుంటూరును రాజధానిగా ఏర్పాటు చేయనున్నారనే వార్తల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో భూప్రకంపనలు దుమారం రేపుతున్నాయి. రేపు రాజధాని ఏర్పడిన తరువాత ఏదయినా జరగరాని దారుణం జరిగితే అనే భయం రాష్ట్ర ప్రజల్లో ఊపిరిపోసుకుంటోంది. కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం సంభవించే అవకాశముందని భూభౌతిక శాస్త్రవేత్తలు గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే దుర్గ గుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం సాధ్యం కావడం లేదు. నదీ పరివాహక ప్రాంతం కావడంతో విజయవాడకు ముప్పు పొంచి ఉందని, ఎప్పటికప్పుడు భూ పొరల్లో మార్పులు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరో వైపు ఏదిఏమైనా విజయవాడ, గుంటూరే రాజధాని అంటూ మంత్రి నారాయణ నొక్కివక్కాణిస్తున్నారు. ఇంతలో భూమి కంపించి హెచ్చరికలు జారీ చేసింది. ఓ స్థాయిని మించిన నిర్మాణాలకు అక్కడి నేలలు సహకరించవని సోయిల్ మేనేజ్ మెంట్ నిపుణులు గతంలో హెచ్చరించారు. దీంతో కోస్తాలో రాజధాని నిర్మాణం సురక్షితమేనా అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది.