: చెట్టు ఆ గ్రామాన్ని సుభిక్షం చేస్తోంది


వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు, కానీ మనం అడవుల్ని నరికేసుకుని కాంక్రీట్ జంగిల్ ను తయారు చేసుకుంటున్నాం. అభివృద్ధి పేరిట ప్రభుత్వాలే వేల ఎకరాలను సేకరించి సెజ్ ల పేరిట ప్రాకృతిక హననానికి పాల్పడుతున్నాయి. అంతా చేసి వాతవరణం మారిపోయింది, కాలం, రుతువులు మారిపోయాయని గగ్గోలు పెడుతుంటాం. ఇలాంటి నేపథ్యంలో ఓ గ్రామం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. సామాజిక బాధ్యతతో ప్రపంచాన్ని తనవైపు తిరిగి చూసేలా చేసింది. ఆడ, మగ తేడాలు పోయాయని గంటలకొద్దీ లెక్చర్లిస్తాం. కానీ ఆడపిల్ల పుడితే పురిట్లోనే చంపేస్తాం. దానికి సవాలక్ష కారణాలు చెబుతాం. కానీ ఆడపిల్ల పుడితే ఊరంతా సంబరాలు చేసుకోవడం ఎక్కడైనా చూశామా? అమ్మాయికి గుర్తుగా 111 చెట్లు నాటి, వాటిని పెంచి పెద్దవి చేసే జనాల గురించి ఎప్పుడైనా విన్నామా? ఉంది అలాంటి ఊరు ఉంది. అమ్మాయి పుడితే అమ్మ పుట్టిందని సంబరపడిపోయో జనాలు ఇంకా ఉన్నారు. రాజస్థాన్‌లో పిప్లాంట్రి అనే గ్రామం గురించి ఆరేళ్ల కిందటి వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడా గ్రామం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దానికి కారణం ఆడపిల్ల. అదెలా అనుకుంటున్నారా? అక్కడ ఆడపిల్ల పుడితే అమ్మే దేవతగా తమ ఇంట కొలువు తీరిందనుకుంటారు. సంతోషంతో ఉప్పొంగిపోతారు, సంబరాలు చేసుకుంటారు. వెంటనే మామిడి, నిమ్మ, ఉసిరి లాంటి 111 చెట్లు నాటుతారు. దీనికి ఆద్యుడు పిప్లాంట్రి గ్రామ సర్పంచి శ్యామ్‌సుందర్ పలివాల్. అతను తన కూతుర్ని కోల్పోయిన కొన్ని నెలలకు మొదలుపెట్టారు. గ్రామస్తులందరినీ సమావేశపరిచి, ఆడపిల్ల పుడితే చెట్లు నాటి, వాటిని పెంచి పెద్దచేద్దామన్న పలివాల్ ఆలోచనను ఎవరూ స్వాగతించలేదు. అతని సన్నిహితులు ఒకరిద్దరు ఈ సంప్రదాయం పాటించడంతో దానిని అందరూ అనుసరించారు. కేవలం చెట్లు నాటేసి తూతూ మంత్రంగా ముగించేయలేదు. వాటిని పెంచి, పెద్ద చేసే బాధ్యత కూడా వారిదే ఇలా చేసేందుకు పంచాయతీ ఆడపిల్ల పుట్టిన కుటుంబ యజమానికి 10 వేల రూపాయలు ఇస్తుంది. అక్కడితో ఆగకుండా గ్రామస్తులంతా చందాల రూపంలో మరో 21 వేల రూపాయలు ఇస్తారు. ఆ మొత్తాన్ని పుట్టిన పిల్ల పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు. 20 ఏళ్ల తరువాత ఆ ఎఫ్‌డీ అమ్మాయి చేతికందుతుంది. అది ఆమె భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఇందుకు చేయాల్సింది ఒకటే 18 ఏళ్ల కంటే ముందు అమ్మాయికి పెళ్లి చేయబోమని, ఆమె చదువును ఆపబోమని, తనకోసం నాటిన చెట్లను కాపాడతామని పంచాయితీకి తల్లిదండ్రులు అఫిడవిట్ కూడా సమర్పించాలి. అంతే కాదు అది తూచా తప్పకుండా పాటించాలి. అలా కాదని దీనిని ఎవరైనా మీరితే గ్రామంలో ఎవ్వరూ ఆ కుటుంబానికి సహకరించరు. దీంతో ఆడపిల్లను కనడం కంటే గొప్పపని ఏదీ లేదని అక్కడి వారు భావిస్తున్నారు. అమ్మాయి భద్రత విషయంతోనే పిప్లాంట్రి పంచాయతీ ఆగిపోవట్లేదు. ఆడపిల్ల పుట్టినప్పుడే కాదు, ఎవరైనా చనిపోయినప్పుడు కూడా 11 చెట్లు నాటడం కూడా విశేషం. ఈ రకంగా ఆగ్రామం సామాజిక, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తూ ప్రపంచాన్ని తనవైపు తిరిగి చూసేలా చేసుకుంది.

  • Loading...

More Telugu News