: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల... ఆళ్లగడ్డ ఎన్నిక లేదట!


దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల ఎన్నిక కోసం ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ వివాదాస్పదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మూడు పార్లమెంట్, 34 అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించి మెదక్ పార్లమెంట్ స్థానంతో పాటు ఆళ్లగడ్డ, నందిగామ అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే శనివారం ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ లో ఆళ్లగడ్డ స్థానానికి చోటు దక్కలేదు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మెదక్ పార్లమెంట్, నందిగామ అసెంబ్లీతో పాటు దేశంలో మిగిలిన రెండు పార్లమెంట్, 32 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఈ జాబితాలో ఆళ్లగడ్డ స్థానం లేకపోవడం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది. వాస్తవ పరిస్థితిని గమనిస్తే, ప్రస్తుతం దేశంలో ఖాళీగా ఉన్న పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో అన్నింటికంటే ముందుగా ఖాళీ అయిన స్థానం ఆళ్లగడ్డ అసెంబ్లీనే. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ అసెంబ్లీకి నామినేషన్ వేసిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి భూమా శోభా నాగిరెడ్డి దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. అయితే అప్పటికే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాటు పూర్తైన నేపథ్యంలో మరణించినప్పటికీ శోభా నాగిరెడ్డి పేరును తొలగించడం సాధ్యపడలేదు. బరిలో శోభా నాగిరెడ్డి ఉన్నట్లుగానే జరిగిన ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. అయితే అంతకుముందే ఆమె మరణించినందున ఆ స్థానం ఖాళీ అయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మరి, తాజా ఉప ఎన్నికల షెడ్యూల్ జాబితాలో ఆళ్లగడ్డ లేకపోవడం పలువురిని విస్మయానికి గురి చేసింది. కేవలం కోర్టులో కేసు పెండింగ్ ఉందన్న కారణంగా ఎన్నికను ఎలా నిలుపుతారంటూ వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది. మరి ఎన్నికల సంఘం ఏ కారణం చూపి ఆళ్లగడ్డ ఎన్నికను వాయిదా వేసిందన్న విషయం స్పష్టం కాకపోతే దీనిపై విస్తృత స్థాయిలో చర్చ జరగడమే కాక పలు కొత్త సందేహాలకు తెర తీసిట్లవుతుందన్నది విశ్లేషకుల భావన.

  • Loading...

More Telugu News