: ఒక్క రోజు కూడా ఆడలేకపోయిన టీమిండియా... 148కి కథ ముగిసింది
టీమిండియా ఐదోటెస్టు తొలి ఇన్నింగ్స్ లో పేలవ ప్రదర్శన నిర్విఘ్నంగా పూర్తైంది. ఐదో టెస్టులో ప్రదర్శించిన ఆటతీరుతో టీమిండియా దారుణ ప్రదర్శన మరో మెట్టు దిగజారింది. ఒకరి తరువాత ఒకరుగా భారత బ్యాట్స్ మన్ అంతా తొలిరోజే చేతులెత్తేశారు. కెప్టెన్ ఇన్సింగ్స్ తో ధోనీ ఒంటరి పోరాటం చేయడంతో అత్యల్ప స్కోరు సాధించింది. ధోనీ 82 పరుగుల వద్ద అవుటవ్వడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మిగిలిన బ్యాట్స్ మన్ లో మురళీ విజయ్ (18), అశ్విన్ (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగిలిన ఆటగాళ్లంతా పెవిలియన్ కు క్యూ కట్టారు. మిగిలిన ఆటగాళ్ల కంటే ఎక్సట్రాలే (7) ఎక్కువ కావడం విశేషం. జోర్డన్, ఓక్స్ చెరి మూడు వికెట్లతో రాణించగా, ఆండర్సన్, బ్రాడ్ చెరో రెండు వికెట్ తీసి సత్తా చాటారు. ఏదయినా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్ డ్రా కావడం కల్ల!