: అతి కష్టం మీద అర్ధ సెంచరీ సాధించిన టీమిండియా... మనవాళ్ల ఆట సాగిందిలా...!
టీమిండియా మరోసారి సైకిల్ స్టాండ్ ను తలపించింది. ఓపెనర్లు విఫలమైతే భారత జట్టు పనైపోయినట్టేనని చెప్పిన వ్యాఖ్యాతల మాటలు నిజం చేస్తూ పేలవమైన ప్రదర్శన చేసింది. వరుస ఓటములతో డీలాపడిన ఇంగ్లండ్ తో సిరీస్ ఆరంభించిన టీమిండియా ఆ జట్టులో మానసిక స్థైర్యం నింపింది. పేలవ ప్రదర్శనతో జట్టులో స్థానానికి అనర్హుడనిపించుకున్న కుక్ చేత విలువైన ఇన్నింగ్స్ ఆడించి, అతని కెరీర్ గాడిన పడడానికి తమ వంతు సాయం చేసిన టీమిండియా ఆటగాళ్లు... చెత్తగా ఓడిపోయేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. గల్లీ క్రికెటర్లు కూడా పరువు పోకుండా ప్రతిఘటిస్తారేమో... టీమిండియా అత్యుత్తమ ఆటగాళ్లు మాత్రం పరువు తక్కువ ప్రదర్శన చేశారు. సొంతగడ్డపై చిరుతలు, విదేశాల్లో కాగితం పులులు అనే మాటలను నిజం చేస్తూ టీమిండియా టాపార్డర్ మొత్తం సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. ఓపెనర్ విజయ్ సాధించిన 18 పరుగులే అత్యుత్తమం. గంభీర్ గోల్డెన్ డక్ కాగా, పుజారా 4 పరుగులకే చాలనిపించాడు. కోహ్లీ చెత్త ఫాంను మరోసారి కొనసాగిస్తూ 6 పరుగులు చేశాడు. సీనియర్లే ఆడకపోతే తానాడితే బాగోదనుకున్నాడో ఏమో కానీ, రహానే ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. క్రీజులోకొచ్చిన కెప్టెన్ ధోనీ (11)కి, కొత్త ముఖం స్టువర్ట్ బిన్నీ 5 పరుగులు చేసి ఉసూరుమనిపించాడు. దీంతో అశ్విన్ (4) జత కలిశాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో ఆండర్సన్, జోర్డన్ చెరి రెండు, బ్రాడ్, వోక్స్ చెరో వికెట్ తీసి టీమిండియా నడ్డి విరిచారు. మొత్తానికి అతి కష్టమ్మీది టీమిండియా అర్ధ సెంచరీ సాధించింది. ఆరు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది.