: టిబెట్ లో రెండో రైల్వేలైన్ ను ప్రారంభించిన చైనా... భారత్ కు పొంచి ఉన్న ముప్పు!
టిబెట్ లో తాను నిర్మించిన రెండో రైల్వే లైన్ ను చైనా సరిగ్గా భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రారంభించింది. భారత సరిహద్దులోని సిక్కింకు చాలా దగ్గరగా ఉండే ఈ రైల్వే మార్గం ద్వారా హిమాలయ ప్రాంతంలో చైనా కదలికలు సులభమయ్యే ప్రమాదం ఉంది. 253 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వేలైన్ వల్ల లాసా-జిగాజే పట్టణాల మధ్య ప్రయాణ సమయం చాలా తగ్గుతుంది. 2010లో ప్రారంభమైన ఈ రైల్వే లైన్ నిర్మాణం ఇటీవలే పూర్తైంది. దానిని చైనా ఉద్దేశపూర్వకంగానే ఆగస్టు 15న ప్రారంభించింది. అరుణాచల్ ప్రదేశ్ కి దాదాపు అనుకుని ఉండే నైయింగ్ చీ నుంచి లాసాకి మరో రైల్వే లైన్ నిర్మాణానికి త్వరలో చైనా పూనుకోనుంది. అది కూడా పూర్తయితే భారత సరిహద్దుల్లో పాక్ తో వేగుతున్న దానికంటే ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే పాక్, శ్రీలంకల్లో ఎయిర్ బేస్ లు సిద్ధం చేసుకుంటున్న చైనా, భారత దేశాన్ని అష్టదిగ్బంధనం చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. తాజా ప్రయాత్నాల పట్ల భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.