: టీనేజ్ లోనే మందుకు అలవాటుపడ్డారా?
టీనేజ్లోనే మద్యానికి బానిసైన వారు ఆరోగ్యం, సామాజిక కోణాలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. మద్యంతాగే అలవాటు మన దేశంలోని టీనేజర్లలో పెరుగుతోందని తాజా అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని అబ్బాయిలు మద్యపానానికి బానిసలవుతున్నారు. 1956-1960 మధ్య కాలంలో 19.5 శాతం మేల్ టీనేజర్లు మద్యానికి అలవాటుపడితే, ప్రస్తుతం వారి సంఖ్య 70 శాతం కంటే అధికమైపోయిందని కొలంబియా యూనివర్శిటీకి చెందిన అరవింద్ పిళ్ళై బృందం స్పష్టం చేసింది. ఏ వయసులో మొదట మందు కొట్టారు? ఎంత మోతాదులో మద్యం తాగారు? అలా తాగినప్పుడు ఏవైనా ప్రమాదాలు సంభవించాయా? ఇప్పుడు ఎంత మోతాదులో మద్యం తాగుతున్నారు? వంటి ప్రశ్నలతో ఆయన అధ్యయనం చేశారు. కేవలం మద్యపానానికి సంబంధించిన ప్రశ్నలే కాకుండా, మత్తులో మానసిక స్థితిగతులపై కూడా ఆయన ప్రశ్నలు వేశారు. ఒకప్పుడు సంపన్నదేశాల టీనేజర్లలో ఉన్న ఈ అలవాటు, ఇప్పుడు అభివృద్ధితో సంబంధం లేకుండా దాదాపు అన్ని దేశాల్లోని టీనేజర్లలోనూ ఉందని ఆయన పేర్కొన్నారు. టీనేజ్ లోనే మద్యానికి బానిసైన వారు ఆరోగ్య, సామాజిక కోణాలలో తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే ఆనందం కోసం అనే సాకుతో తీసుకునే మద్యం పెను విపత్తుగా మారుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు. మద్యపానం వల్ల ఉత్సాహం వస్తుందని, కిక్కులో ఆనందం ఉందనే మాటలు అబద్ధాలని ఆయన తెలిపారు. టీనేజ్ లో ఎంజాయ్ చేయకపోతే ఎలా? అంటూ రెచ్చగొట్టే స్నేహితులతో స్నేహం కట్ చేసుకోవడమే మంచిదని ఆయన సలహా ఇస్తున్నారు. రోజూ తాగట్లేదుగా... ఈరోజే కదా అనుకుంటే వారం, నెల, ఏడాదిగా మారుతుందని ఆయన హెచ్చరించారు.