: కపిల్ దేవ్ కమిటీపై గుర్రుగా ఉన్న హాకీ ఇండియా
అర్జున అవార్డుల విషయంలో హాకీ క్రీడాకారులకు అన్యాయం జరిగిందని భావిస్తోంది హాకీ ఇండియా (హెచ్ఐ). క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ నాయకత్వంలోని అర్జున అవార్డు ఎంపిక కమిటీ చేతిలో తాము మోసపోయామని హెచ్ఐ వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయి. తాము ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు కోసం ఏడుగురు హాకీ క్రీడాకారుల పేర్లు సిఫారసు చేసినా కపిల్ కమిటీ పట్టించుకోలేదని హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ నరిందర్ బాత్రా ఆరోపించారు. హాకీ ఇండియా కార్యవర్గం నుంచి తాము తొలగించిన అనుపమ్ గులాటీకి 'అర్జున' ఎంపిక కమిటీలో స్థానం కల్పించడంపైనా బాత్రా మండిపడ్డారు. తాము సూచించిన క్రీడాకారుల్లో ఒక్కరికీ ప్రభుత్వం అర్జున ఇవ్వని నేపథ్యంలో, తామే వారికి రూ.2 లక్షల చొప్పున నజరానా అందిస్తామని బాత్రా స్పష్టం చేశారు.