: 'లీగల్' కష్టాల్లో గూగుల్
సెర్చ్ ఇంజిన్ జెయింట్ గూగుల్ పై కేసు నమోదు చేసినట్టు కేంద్రం తెలిపింది. నేషనల్ మ్యాప్ పాలసీ-2005 ను ఉల్లంఘించినందుకు గూగుల్ సంస్థపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. లోక్ సభకు ఆయన ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. "రక్షణ మంత్రిత్వ శాఖ, మరే ఇతర ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండా గూగుల్ సంస్థ మ్యాపథాన్-2013 నిర్వహించింది. ఆ కార్యక్రమంలో భాగంగా భారత్ లోని కీలక, సున్నితమైన ప్రదేశాలను సైతం చిత్రీకరించింది. ఇది నేషనల్ మ్యాప్ పాలసీ-2005ను ఉల్లంఘించడమే. సర్వే ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు 2013 ఫిబ్రవరిలో ఢిల్లీ పోలీస్ విభాగం వద్ద ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది" అని జితేంద్ర సింగ్ సభకు వివరించారు.