: అటూ, ఇటూ కాకున్నా అడ్మిషన్లిస్తాం: ఢిల్లీ వర్సిటీ
అటు ఆడకూ, ఇటు మగకూ చెందని వారికీ ప్రవేశాలు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ వర్సిటీ ప్రకటించింది. ఈ ఏడాది నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో హిజ్రాలకు కూడా అడ్మిషన్లను ఇవ్వనున్నట్లు ప్రకటించిన ఢిల్లీ వర్సిటీ అధికారులు, వచ్చే ఏడాది నుంచి అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లోనూ వారికి ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు. వీరికి ఓబీసీ కోటాలోనే ప్రత్యేక కేటగిరీ కింద అడ్మిషన్లు లభించనున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఢిల్లీ వర్సిటీ పేర్కొంది. ఢిల్లీ వర్సిటీ ప్రకటనపై హర్షం వెలిబుచ్చిన హిజ్రాల సంఘం, ప్రవేశాలతో పాటు వర్సిటీలో తమకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. ఢిల్లీ వర్సిటీ నిర్ణయం తమకు మెరుగైన జీవితాలను ప్రసాదించేదేనని వ్యాఖ్యానించింది. అయితే, తమపట్ల సమాజం వైఖరిలో మార్పు వచ్చేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.