: రోజూ టీ తాగుతారా.. అయితే, కాస్త ఇది చదవండి!
కొందరికి టీ పడందే బతుకు బండి స్టార్ట్ కాదు! సర్వకాల సర్వావస్థల్లో తాగదగిన పానీయంగా దీనికి పేరు. తలనొప్పి తగ్గిస్తుందని, హుషారు తెస్తుందని... ఇలా ఎవరి నమ్మకం వారిది! అలాంటి టీపై గ్రీన్ పీస్ అనే స్వచ్ఛంద సంస్థ ఓ ఏడాదిపాటు అధ్యయనం చేసింది. అందులో ఎలాంటి విషయాలు వెల్లడయ్యాయో చూడండి. ప్రముఖ బ్రాండ్లకు చెందిన టీ పొడిలో ప్రమాదకరమైన పురుగుమందుల అవశేషాలున్నాయట. మొత్తం 49 నమూనాలు పరిశీలించారు. వాటిలో 29 నమూనాల్లో ఒక్కొక్కటి 10 రకాల పురుగుమందు అవశేషాలను కలిగి ఉన్నాయట. ఈ విషయాలను 'గ్రీన్ పీస్' సీనియర్ ప్రచారకర్త నేహా సెహ్ గల్ తెలిపారు. తమ అధ్యయనంలో భాగంగా ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు, ముంబయి వంటి మహానగరాల్లో రిటైలర్ల నుంచి తేయాకును సేకరించామని నేహా చెప్పారు. కాగా, 67 శాతం నమూనాల్లో డీడీటీ ఆనవాళ్ళు లభించాయని తెలిపారు. వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తేయాకు రంగాన్ని పురుగుమందుల వాడకానికి దూరంగా తీసుకెళ్ళాలని నేహా ప్రముఖ కంపెనీలను అర్థించారు. పురుగుమందులు అవసరంలేని వ్యవసాయ విధానాలను ప్రోత్సహించాలని కోరారు.