: షారూఖ్ ఖాన్ ను 'చలం' ఆవహించినట్టుంది..!
"ఇద్దరు స్త్రీపురుషులు సన్నిహితంగా ఉంటే ఈ సమాజం ఎందుకు భరించలేకపోతోంది"? -చలం "స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం చూపడం దారుణం, హాస్యాస్పదం"! -షారూఖ్ ఖాన్ ఈ రెండు వ్యాఖ్యలను లోతుగా పరిశీలించి చూస్తే భావం ఒక్కటే అన్న విషయం అర్థమవుతోంది. అందులో పై వ్యాఖ్య మహారచయిత చలం గుండెల్ని చీల్చుకుని బయటికి రాగా... రెండో కామెంట్ ను బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ సంధించాడు. కోల్ కతాలో శనివారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో షారూఖ్ ఓ మహిళా పోలీసు అధికారితో డ్యాన్సు చేయడం వివాదాస్పదమైంది. దీనిపై పశ్చిమబెంగాల్ విపక్షాలు సీఎం మమతా బెనర్జీని దుయ్యబట్టాయి. ప్రభుత్వ కార్యక్రమాలకు ఫిలిం స్టార్లను పిలిస్తే ఇలాగే ఉంటుందని ఎత్తిపొడిచాయి. పోలీస్ శాఖ వార్షిక సాంస్కృతికోత్సవానికి షారూఖ్ హాజరయ్యారు. ఆ వేడుక సందర్భంగా యూనిఫాంలో ఉన్న సంపా హల్దార్ అనే మహిళా ఇన్ స్పెక్టర్ ను పైకెత్తుకుని నర్తించాడు. ఈ నేపథ్యంలోనే విమర్శలు వచ్చాయి. వీటిపై స్పందించిన కింగ్ ఖాన్... కచ్చితంగా ఇది స్త్రీ పురుషులను వేరు చేసి చూడడమే అని వ్యాఖ్యానించారు. మహిళ యూనిఫాంలో ఉంటే ఏమైంది? అసలు ఇలాంటి వాటి గురించి మాట్లాడడమే అనవసరం అని పేర్కొన్నారు. 'ఇక్కీస్ టొప్పోం కీ సలామీ' చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ షారూఖ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఇంతకుముందు 'వీర్ జారా' చిత్ర షూటింగ్ సందర్భంగా యూనిఫాంలో ఉన్న జవాన్లతో డ్యాన్సు చేశానని, అప్పుడెవరూ మాట్లాడలేదని, ఇప్పుడు యూనిఫాంలో ఉన్న ఓ మహిళతో నర్తించగానే విమర్శలు చేయడం దారుణమని అన్నారు.