: కెరీర్ చివరి టెస్టుకు సిద్ధమైన లంక దిగ్గజం
శ్రీలంక క్రికెట్ మూలస్తంభాల్లో ఒకడిగా పేరుగాంచిన మహేల జయవర్ధనే (37) టెస్టు కెరీర్ మరో మ్యాచ్ తో ముగియనుంది. పాకిస్థాన్ తో గురువారం ఆరంభమయ్యే రెండో టెస్టుతో మహేల ఐదు రోజుల క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడు. ఇటీవలే టి20 వరల్డ్ టైటిల్ గెలిచిన అనంతరం మినీ ఫార్మాట్ కు వీడ్కోలు చెప్పిన ఈ మాజీ కెప్టెన్, తాజాగా టెస్టు బరి నుంచి తప్పుకోనుండడంతో లంక క్రికెట్ ఫ్యాన్స్ విచారంలో మునిగిపోయారు. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిస్థాయిలో తప్పుకునే అవకాశాలున్నాయి. కాగా, ప్రపంచ క్రికెట్లో వన్డేలు, టెస్టుల్లో 11 వేలకు పైగా పరుగులు సాధించిన ఐదుగురు క్రికెటర్లలో మహేల ఒకడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, జాక్వెస్ కలిస్, కుమార సంగక్కర ఉన్నారు. ఇప్పటివరకు 148 టెస్టులాడిన మహేల 50.02 సగటుతో 11,756 పరుగులు చేశాడు. వాటిలో 34 సెంచరీలు, 49 అర్థసెంచరీలు ఉన్నాయి.