: ఎంఐఎం కనుసన్నల్లో టీఆర్ఎస్ పనిచేస్తోంది: కిషన్ రెడ్డి
గవర్నర్ కు అధికారాలు కట్టబెట్టడంపై కేంద్రం, ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేయడాన్ని బీజేపీ తెలంగాణ నేత కిషన్ రెడ్డి ఖండించారు. బీజేపీ సహకారంతోనే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. బీజేపీ, మోడీని కేసీఆర్ టార్గెట్ చేయడం సరికాదన్నారు. అసలు తమ పార్టీకి పూర్తి మెజారీటీ రావడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని, బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఆనాడు బిల్లు ఆమోదం పొందినప్పుడు, సోనియాను కలసి సంబరాలు చేసుకున్నప్పుడు గవర్నర్ అధికారాలపై కేసీఆర్ కు తెలియదా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై అన్నీ తెలిసిన జేఏసీ కూడా ఎందుకు స్పందించడం లేదని సూటిగా అడిగారు. బిల్లు ఏకపక్షంగా కాకుండా అందరి అభిప్రాయంతోనే ఆమోదించారని చెప్పారు. కానీ, అంతా సంస్కార హీనంగా వ్యవహరిస్తున్నారని, కయ్యానికి కాలు దువ్వుతున్నారని వ్యాఖ్యానించారు. ఎంఐఎం కనుసన్నల్లో టీఆర్ఎస్ ఇదంతా చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ కోసం బీజీేపీ త్యాగం చేసిందన్న కిషన్ రెడ్డి, రాష్ట్ర ఆవిర్భవ ఉత్సవాలకు కేంద్రాన్ని పిలవకపోవడం సరికాదన్నారు.