: ఫిలాండర్ ను కిందికి నెట్టిన అశ్విన్
టెస్టు విభాగంలో ఐసీసీ తాజా ర్యాంకులను ప్రకటించింది. ఆల్ రౌండర్ల విభాగంలో భారత్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానాన్ని అధిష్ఠించాడు. ఈ క్రమంలో అశ్విన్... సఫారీ ఆల్ రౌండర్ వెర్నాన్ ఫిలాండర్ ను రెండోస్థానానికి నెట్టాడు. ఇక, మూడోస్థానంలో బంగ్లాదేశ్ కు చెందిన షకీబల్ హసన్ నిలిచాడు. కాగా, భారత్ తో టెస్టు సిరీస్ లో విశేష ప్రదర్శన కనబరుస్తున్న ఇంగ్లండ్ క్రికెటర్ స్టూవర్ట్ బ్రాడ్... ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ జాన్సన్ ను అధిగమించి నాలుగో స్థానానికి ఎగబాకాడు. బ్యాటింగ్ ర్యాంకుల విషయానికొస్తే శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర టాప్ ర్యాంకును తిరిగి దక్కించుకున్నాడు. పాకిస్థాన్ తో తొలి టెస్టులో డబుల్ సెంచరీ మోత మోగించిన సంగా... తాజా ర్యాంకుల్లో ఏబీ డివిల్లీర్స్ ను కిందికినెట్టి అగ్రపీఠం అలంకరించాడు. కాగా, టాప్-10లో ఒక్క భారత బ్యాట్స్ మన్ కూడా చోటు దక్కించుకోలేకపోయారడు. ఇంగ్లండ్ గడ్డపై పేలవ ప్రదర్శన నేపథ్యంలో వారి ర్యాంకులు భారీగా పతనమయ్యాయి. పుజారా 12వ ర్యాంకులో ఉండగా, కోహ్లీ 20వ స్థానానికి పడిపోయాడు. కెప్టెన్ ధోనీ 32, రహానే 34వ ర్యాంకుల్లో నిలిచారు. బౌలింగ్ ర్యాంకుల్లోనూ మనవాళ్ళది అదే పరిస్థితి. అందరిలోకి మెరుగ్గా అశ్విన్ 13వ స్థానంలో ఉన్నాడు. ఇషాంత్ 20, జడేజా 26వ స్థానాల్లో నిలిచారు. ఈ జాబితాలో డేల్ స్టెయిన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.