: రెడ్డి సామాజికవర్గానికి కాషాయదళం వల..!
ఆంధ్రప్రదేశ్ లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు భారతీయ జనతా పార్టీ వ్యూహాలు రచిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తన హవా చాటిన కాషాయదళం... ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అంతంతమాత్రంగానే ప్రభావం చూపిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీలో రెడ్డి సామాజిక వర్గాన్ని తనవైపుకు తిప్పుకుని 2019 కల్లా ఇక్కడ టీడీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ చూస్తోంది. ఇందుకోసం పక్కా ప్రణాళిక వేసిన బీజేపీ... పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాం మాధవ్ కు ఏపీ ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు అప్పగించింది. ఇక నుంచి ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసే వ్యవహారాలను ఆయనే పూర్తి స్థాయిలో పర్యవేక్షించనున్నారని సమాచారం. విభజన అనంతరం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ లో ఉన్న రెడ్డి నేతలు ఏపీలో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అటు, వైసీపీ నేతలు కూడా అయోమయంలో ఉన్నారు. దీన్ని క్యాష్ చేసుకుని రెడ్డి వర్గాన్ని బీజేపీ వైపుకు తిప్పుకుంటే ఏపీలో పార్టీకి గట్టి పునాది పడుతుందనేది కాషాయ పార్టీ ఆలోచన. ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, ఇంకా గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రెడ్డివర్గం నుంచి ప్రముఖ నేతలున్నారు. ఎప్పటినుంచో వారికి వర్గబలంతో పాటు రాజకీయ పలుకుబడి కూడా ఉంది. ఈ నేపథ్యంలో నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, కర్నూలుకు చెందిన మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిలతో మాట్లాడనున్నారట. ఆనం సోదరులు, కోట్లతో ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి మంచి సంబంధాలు ఉన్నాయని, కచ్చితంగా తమ ప్రయత్నాలు ఫలిస్తాయని బీజేపీ భావిస్తోంది. ఇక, చిత్తూరుకు చెందిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కూడా చర్చించనున్నారట. ఈ క్రమంలో రానున్న రోజుల్లో వారితో మాట్లాడి పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తారని తెలుస్తోంది. ఇటీవల జనసేన పార్టీ స్థాపించిన పవన్ కల్యాణ్ తమతో పొత్తు పెట్టుకోవడం వల్లే కాపు కమ్యూనిటీ మద్దతిచ్చిందని, అందుకే సార్వత్రిక ఎన్నికల్లో కొంతవరకు ఏపీలో విజయం సాధించామని బీజేపీ అనుకుంటోంది. తత్ఫలితంగానే తమ పార్టీ నేత పి.మాణిక్యాలరావుకు చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి దక్కిందని భావిస్తోంది. ఏదేమైనా భవిష్యత్తులో ఏపీలో తమ ప్రాబల్యం ఉండాలని బీజేపీ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.