: తనకు రిటైర్మెంట్ లేదంటున్న మాజీ ప్రధాని


మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) పార్టీ అధినేత హెచ్.డి.దేవెగౌడ ఏమంటున్నారో వినండి. రాజకీయాల నుంచి రిటైరయ్యే ప్రశ్నేలేదని అంటున్నారు. పార్టీని తానే ముందుండి నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. నేషనల్ మీడియాతో మాట్లాడుతూ... కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. కుమారస్వామి తనను రాజకీయాల నుంచి తప్పుకోవాలని కోరినట్టు వస్తున్న వార్తలను ఖండించారు. ఇటీవలే కుమారులు కుమారస్వామి, రేవణ్ణ తనను కలిశారని ఈ వృద్ధనేత తెలిపారు. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి నిర్మించడంపై దృష్టి పెడతామని చెప్పారు. కాగా, తన జీవితచరిత్ర వచ్చే ఏడాది జనవరిలో విడుదల అవుతుందని దేవెగౌడ వెల్లడించారు. తనపైనా, తన పార్టీపైనా వచ్చిన ఆరోపణలకు ఆ పుస్తకం జవాబిస్తుందని అన్నారు. దేవెగౌడ 1996-97 మధ్య కాలంలో యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా వ్యవహరించారు. అంతకుముందు 1994-96 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు.

  • Loading...

More Telugu News