: ములాయంతో సంబంధాలు దెబ్బతినడానికి కారణం జయా బచ్చనే: అమర్ సింగ్
తన మాజీ స్నేహితుడు, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తో సంబంధాలు దెబ్బతినడానికి కారణం నటి, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చనేనని ఎంపీ అమర్ సింగ్ ఆరోపించారు. ఈ మేరకు సీఎన్ఎన్- ఐబీఎన్ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. తమ ఇద్దరి (ములాయం-అమర్) మధ్య జయను మధ్యవర్తిగా నియమించినప్పుడే సమస్య మరింత పెరిగిందన్నారు. అయితే, తమ మధ్య సంబంధాలకు ఏ మధ్యవర్తి గానీ, బ్రోకర్ గానీ అవసరంలేదన్నారు. కాగా, ఇటీవల లక్నోలో ఎస్పీ నిర్వహించిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ములాయం, అమర్ పాల్గొన్నారు. చాలాకాలం తర్వాత ఒకే వేదికపైకి వచ్చినప్పటికీ వారిద్దరూ చూసుకోవడంగానీ, మాట్లాడుకోవడంగానీ జరగలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ సమాజ్ వాదీ గూటికి చేరేందుకే అమర్ ప్రయత్నిస్తున్నారని సమాచారం.