: ఇండియన్ ముజాహిదీన్ ఖాతాలో రూ.200 కోట్లున్నాయట!
లష్కరే తాయిబా సహకారంతో భారత్ లో విధ్వంస రచనకు పాల్పడుతున్న ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన బ్యాంక్ ఖాతాలో ప్రస్తుతం రూ.200 కోట్లున్నాయట. ఇప్పటికే ఈ ముష్కర ముఠా హైదరాబాద్ పై రెండు సార్లు పంజా విసిరింది. మరోమారు దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించిందన్న చేదు నిజాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా భారీ ఎత్తున దందాలకు పాల్పడుతున్న ఈ సంస్థ ఉగ్రవాదులు తమ ఖాతాను నానాటికీ పెంచేస్తున్నారట. ఏర్పాటైన తొలినాళ్లలో పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, లష్కరే తాయిబా అందించే నిధులపైనే ఆధారపడ్డ ఐఎం, ఆ తర్వాత భత్కల్ సోదరుల రాకతో సొంతంగా నిధులను కూడగట్టే దిశగా అడుగులేసిందని తెలుస్తోంది. కోల్ కతాకు చెందన రాయ్ బర్మన్ ను 2000 ఏడాదిలో బెదిరించి రూ. 3.50 కోట్లను వసూలు చేసింది. అప్పటినుంచి ఇదే పంథాను కొనసాగిస్తోంది. కిడ్నాప్ లు కూడా చేయాలని భావించిన ఐఎం, అందులో కాస్త రిస్క్ ఉంటుందని వెనకడుగు వేసి, ఫోన్ కాల్స్ తో సులువుగా పనిజరిగే బెదిరింపులనే ఆదాయ మార్గంగా ఎంచుకుంది. ఇటీవల ముంబై, ఢిల్లీల్లోని బడా హోటళ్ల యజమానులను బెదిరించడం ద్వారానే దాదాపు రూ.18 కోట్లను మూటగట్టిందని నిఘా వర్గాల అంచనా. పాక్ లో తయారై, దేశాన్ని ముంచెత్తుతున్న నకిలీ కరెన్సీ వ్యాపారంతో ఐఎం రూ.50 కోట్లు ఆర్జించిందట. ఉత్తర ప్రదేశ్, బీహార్ లతో పాటు బంగ్లాదేశ్ లోనూ అక్రమ ఆయుధాలను విక్రయించడం ద్వారా రూ.40 కోట్ల మేర పోగేసిందని తెలుస్తోంది. దోపిడీలు, దొంగతనాలతో మరో రూ.8 కోట్లను ఖాతాలో వేసిందని సమాచారం. తనకు మార్గదర్శిగా చెప్పుకుంటున్న లష్కరే తాయిబా అనుసరిస్తున్న విధానాన్నే తానూ అనుసరించి నిధులను సొంతంగానే కూడబెట్టేందుకు రంగంలోకి దిగినట్లు భావిస్తున్న నిఘా వర్గాలు, ఈ తరహా కార్యకలాపాలకు చెక్ పడకపోతే ఐఎం భవిష్యత్తులో మరింత ప్రమాదకారిగా మారే అవకాశాలున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.