: మొసలితో పోరాడిన అమెరికా బుడతడు!
అమెరికాలో ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఓ తొమ్మిదేళ్ళ చిన్నారి తన ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రమాదకర మొసలితో పోరాడాడు. వివరాల్లోకెళితే... జేమ్స్ బార్నీ అనే బుడతడు ఫ్లోరిడాలోని ఈస్ట్ లేక్ లో ఈత కొట్టేందుకు వెళ్ళాడు. అతను ఈదుతోండగా ఉన్నట్టుండి వెనుకభాగంలో భరించలేనంత నొప్పిగా అనిపించింది. తానో మొసలి నోటికి చిక్కానన్న విషయాన్ని గ్రహించిన ఆ బాలుడు శక్తినంతటినీ కూడదీసుకుని దాంతో పోరాటం సాగించాడు. బలం కొద్దీ దాన్ని కొట్టసాగాడు. చివరికి రెండు చేతులతో దాని దవడలను తెరిచి ఒక్కసారిగా బయటపడి వేగంగా ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి పడిపోయాడు. 'హెల్ప్'... ' హెల్ప్' అని అరవడంతో అక్కడి వారు బార్నీని నీటిలోంచి బయటికిలాగారు. అక్కడే ఉన్న బార్నీ మిత్రుడు ఎమర్జెన్సీ కాల్ చేయడంతో వైద్య బృందం అక్కడి చేరుకుని అతడిని ఆసుపత్రికి తరలించింది. కాగా, ఆసుపత్రి వైద్యులు బార్నీ గాయాల్లోంచి ఓ మొసలి కోరను బయటికి తీశారట.