: గూగుల్ సంస్థ ఇంటర్నెట్ ను 'కలుషితం' చేస్తోందన్న సర్వే ఆఫ్ ఇండియా
భారత్ లోని కొన్ని సున్నితమైన ప్రదేశాలను సైతం గూగుల్ సంస్థ మ్యాపింగ్ చేయడం పట్ల సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా స్వర్ణ సుబ్బారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. గూగుల్ ఇంటర్నెట్ ను కలుషితం చేస్తోందని ఆయన విమర్శించారు. దేశంలోని కీలకప్రాంతాలను మ్యాపుల్లో పొందుపరచవద్దని తాము హెచ్చరించినా, గూగుల్ పట్టించుకోలేదని తెలిపారు. ఇటీవలే గూగుల్ పై సీబీఐ ప్రాథమిక విచారణకు తెరదీయడం తెలిసిందే. ఈ సందర్భంగా సీబీఐ సర్వే ఆఫ్ ఇండియా సహకారం కోరింది. ఈ నేపథ్యంలో డెహ్రాడూన్ లో సుబ్బారావు మాట్లాడుతూ, 2013లో గూగుల్ తన మ్యాపథాన్ కార్యక్రమం సందర్భంగా ఎన్నో సున్నితమైన ప్రదేశాలకు చెందిన సమాచారం సేకరించిందని, అది ఆమోదయోగ్యం కాదన్న విషయం తాము ఆ సంస్థకు చెప్పామని పేర్కొన్నారు. ఆ సమయంలో సంస్థ ప్రతినిధులు కొందరు ఓ హోటల్లో కలుద్దామని తనతో ప్రతిపాదించారని, అయితే, ఆఫీసులోనే కలుద్దామని తాను గట్టిగా చెప్పానని సుబ్బారావు వెల్లడించారు.