: మహిళల పట్ల జరుగుతోన్న అకృత్యాలు తలదించుకునేలా ఉన్నాయి: వెంకయ్య
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దేశప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. మానవ సంబంధాల్లో సోదర, సోదరీమణుల సంబంధం ఉన్నతమైనదని వెంకయ్య చెప్పారు. దేశ సౌభ్రాతృత్వానికి రక్షాబంధన్ ప్రతీక అన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా మహిళల పట్ల జరుగుతోన్న అకృత్యాలు, అరాచకాలు తలదించుకునేలా చేస్తున్నాయన్నారు. చట్టాలతోనే మహిళలకు రక్షణ కల్పించలేమని... ప్రజల ఆలోచనా ధోరణిలో కూడా మార్పు రావాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాఖీ పౌర్ణమి పండగ ద్వారా మన సంస్కృతీ సంప్రదాయాలు మరోసారి గుర్తు చేసుకోవాలని వెంకయ్యనాయుడు ప్రజలకు సూచించారు. విద్యావ్యవస్థలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల గురించి పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలని ఆయన అన్నారు.