: రక్షాబంధన్ వేడుకలతో కళకళలాడుతోన్న తెలుగు లోగిళ్లు


అన్నాచెల్లెలు, అక్కా తమ్ముళ్ల ఆత్మీయతానురాగాలకు ప్రతీక... ఒకరికి మరొకరు తోడున్నారనే నమ్మకం... సోదర సోదరీమణుల బంధానికి నిలువెత్తు ప్రతిరూపం... రాఖీ పౌర్ణమి. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న భారతీయ సంస్కృతిలోని ఓ అపురూపమైన పండుగ రాఖీ పండుగ. ఈ పండుగను ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోనే జరుపుకునేవారు. అయితే క్రమక్రమంగా ఈ పండుగ ప్రాశస్త్యతను గుర్తించి... భారతదేశంలోని మిగతా ప్రాంతాల ప్రజలు కూడా జరుపుకోవడం మొదలపెట్టారు. దీంతో రక్షాబంధన్ దేశవ్యాప్తంగా జరుపుకునే విశిష్టమైన పండుగగా అవతరించింది. రక్షాబంధన్ సందర్భంగా ఈ రోజు తెలుగు లోగిళ్లన్నీ సోదర సోదరీమణుల ప్రేమానురాగాలతో నిండిపోయాయి. ప్రతి ఏటా శ్రావణమాసం శుక్లపక్షపు పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా జరుపుకోవడం సంప్రదాయం. కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగను జంధ్యాల పౌర్ణమి లేదా శ్రావణ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. చిన్న రాఖీతో అన్నయ్యను చెల్లెలు, తమ్ముడిని అక్క...ఒకరికోసం మరొకరం ఉన్నామంటూ కట్టిపడేసుకుంటారు. ఎలాంటి సమయంలోనైనా తనకు రక్షగా సోదరుడు ఉన్నాడన్న భరోసా సోదరిలో కనిపిస్తే... తనకు ఆత్మీయతానురాగాలు పంచిపెట్టే సోదరి ఉందన్న భావాన్ని సోదరుడిలో నింపుతుంది ఈ రాఖీ బంధనం. రక్త సంబంధీలకునే కాదు... పర స్త్రీలను కూడా తల్లిగా, చెల్లిగా భావించే మహోన్నత సంస్కృతికి చెరగని చిరునామా రాఖీ ఆత్మీయానుబంధం. గత పదిరోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని గ్రామాలు, నగరాల్లోని దుకాణాలు వివిధ రకాల రాఖీల అమ్మకాలతో కళకళలాడుతున్నాయి. అన్ని ప్రాంతాల్లోను రాఖీల అమ్మకాల కోసం ప్రత్యేక స్టాల్స్‌ కూడా వెలిశాయి. ఎవరి స్థాయికి తగ్గట్లు వారు రాఖీలను కొనుగోలు చేస్తున్నారు. రాఖీల కోసం ఆడపిల్లలు దుకాణల వద్ద గుమిగూడి కనపడుతున్నారు. ఒక రూపాయి నుంచి మొదలు కొని వెయ్యి రూపాయల వరకు రాఖీలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌ నగరంలో కొన్ని వేల రూపాయల ఖరీదు చేసే కాస్ట్ లీ రాఖీలను కూడా అమ్ముతున్నారు.

  • Loading...

More Telugu News