: వైయస్ పై అభిమానంతోనే జగన్ వెంట నడిచా... కానీ ఎన్నో అవమానాలు పడ్డా: జూపూడి


తండ్రిని కోల్పోయిన తర్వాత రాజకీయాల్లో ఎవరూ తోడులేని వ్యక్తిగా మిగిలిపోయిన వైయస్ జగన్ కు అండగా ఉండాలనే వైకాపాలో చేరానని వైఎస్ఆర్ సీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్ లు తనకు తోడుగా ఉంటామని చెప్పినా... రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతోనే జగన్ వెంట నడిచానని తెలిపారు. వైయస్ మరణం సహజం కాదని... కుట్ర అని మొదట చెప్పిన వ్యక్తిని తానే అని చెప్పారు. కానీ, ఆ తర్వాత వైకాపాలో తనకు ఎన్నో అవమానాలు జరిగాయిని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాదులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. జగన్ ను అరెస్ట్ చేసిన రోజున వైయస్ కుటుంబ సభ్యులందరూ రోడ్డు మీద నిరసన కార్యక్రమం చేపట్టారని... ఆ రోజున వారి కుటుంబ సభ్యులతో పాటు తాను, సబ్బం హరి మాత్రమే ఉన్నామని వెల్లడించారు. దీనికి సంబంధించి అందరిపై కేసు నమోదయిందని... ఆరుగురు వ్యక్తుల (విజయమ్మ, భారతి, షర్మిల, సుబ్బారెడ్డి, తాను, బ్రదర్ అనిల్)కు సమన్లు తీసుకుని వచ్చిన కానిస్టేబుల్ తో జూపూడి ఎవరో తమకు తెలియదని సుబ్బారెడ్డి చెప్పారని తెలిపారు. ఈ విషయం చెబుతున్నప్పుడు జూపూడి స్వరం బొంగురుపోయింది. తానెవరో తెలియదనడం తననెంతో బాధించిందని అన్నారు. ఆ తర్వాత వారందరూ కలసి ఓ లాయర్ ను పెట్టుకున్నారని... తాను విడిగా మరో లాయర్ ను పెట్టుకున్నానని వెల్లడించారు.

  • Loading...

More Telugu News