: నకిలీ కలెక్టరమ్మకు అరదండాలు
ఓ నకిలీ కలెక్టరమ్మకు తమిళనాడు పోలీసులు అరదండాలు వేశారు. సేలం జిల్లా కలెక్టరునని ప్రజలను హడలుగొడుతూ మోసాలకు పాల్పడుతున్న ఓ యువతి (26)ని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే... సేలంలోని ఈడపడి పట్టణంలో రహదారి విషయంలో జరిగిన ఘర్షణలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని ఓ ఆసుపత్రిలో చికిత్సకోసం చేర్పించారు స్థానికులు. ఆ ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించిన ఆ యువతి కలెక్టర్ నంటూ ఫేక్ ఐడీ కార్డు చూపించి అక్కడి వారిని తన ప్రశ్నలతో బెదరగొట్టింది. వైద్యులతో అపాయం ఉందంటూ బెదిరింపులకు దిగింది. దీంతో ఆసుపత్రి వర్గాలకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నకిలీ అన్న విషయం బట్టబయలైంది. దీంతో మరింత లోతుగా విచారించిన పోలీసులు... ఆమె అంతకు మునుపే కలెక్టర్ నంటూ పలువురిని మోసం చేసినట్టు గుర్తించారు. దీంతో ఆమెపై పలు సెక్షన్ల మీద కేసులు పెట్టి, అరెస్టు చేశారు. కాగా, ఆమె భర్త ఓ ఇంటర్నెట్ సెంటర్ నడుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.