: విశాఖ జిల్లాను దేశంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతా: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అనకాపల్లి నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్యకర్తల వల్లే టీడీపీ ఇవాళ ఈ స్థాయిలో ఉందని అన్నారు. నాయకులు పార్టీని వీడినా కార్యకర్తలు మాత్రం తనతోనే ఉన్నారని, పదేళ్లుగా టీడీపీ కార్యకర్తలు పడిన కష్టాలన్నీ తనకు తెలుసని అన్నారు. విశాఖ జిల్లాను దేశంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు చెప్పారు. విశాఖ జిల్లాలోని గిరిజనులందరికీ కుటుంబానికి లక్ష రూపాయల ఆదాయం వచ్చేలా చేస్తానని ఆయన తెలిపారు. బాక్సైట్ గనులు గిరిజనులకు దక్కేలా చూస్తానని బాబు చెప్పారు. గిరిజనుల విభజన వల్ల కలిగిన నష్టాలతో త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తానని చంద్రబాబు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిరోజూ ఏదో ఒక వివాదం సృష్టిస్తోందన్నారు. తెలంగాణలో ఉన్న ఆంధ్ర విద్యార్థులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. గవర్నరుకు అధికారాలు అప్పగించడానికి అప్పట్లో ఒప్పుకున్న కేసీఆర్... ఇప్పుడు అనవసర రాద్ధాంతాలను చేస్తున్నారని ఆయన అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ లో ఆంధ్రప్రదేశ్ 58 శాతం, తెలంగాణ 42 శాతం చెల్లించే ప్రతిపాదనను చేశానని ఆయన చెప్పారు. తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రులిద్దరమూ కలిసి కూర్చుని చర్చిద్దామని చంద్రబాబు అన్నారు. వివాదాలు మంచిది కాదని తెలంగాణ ప్రభుత్వానికి హితవు పలుకుతున్నానని చెప్పారు. ఎంతగా రెచ్చగొట్టినా, తెలుగు ప్రజలను రక్షించే శక్తి తెలుగుదేశానికి ఉందని ఆయన అన్నారు. అభివృద్ధిలో పోటీ పడాలని కేసీఆర్ అన్నారని, అభివృద్ధిలో పోటీ పడేందుకు తాను సిద్ధమని బాబు చెప్పారు. అభివృద్ధి అంటే ఏమిటో.. హైదరాబాదులో చేసి చూపించానని ఆయన అన్నారు. ఎవరు అభివృద్ధి కోసం పాటుపడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని చంద్రబాబు అన్నారు.