: ఇక మన్మోహన్ సింగ్ కూతురు వంతు!
యూపీఏ సర్కారు వైఫల్యాలపై ఇప్పటికే సంజయ్ బారు, నట్వర్ సింగ్ ల పుస్తకాలు పలు విషయాలను వెల్లడి చేసి సంచలనం సృష్టిస్తే, తాజాగా యూపీఏ పదేళ్ల పాలనకు నేతృత్వం వహించిన మన్మోహన్ సింగ్ కూతురు దమన్ వంతు వచ్చినట్లుంది. విడుదలకు సిద్ధమైన తన పుస్తకంలో దమన్, తండ్రిని వెనకేసుకొస్తున్నారు. ఈ క్రమంలో సదరు పుస్తకంలో ఆమె ఎవరెవరిని టార్గెట్ చేస్తారో చూడాలి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచే తన తండ్రికి భారీ స్థాయిలో ప్రతిఘటన ఎదురైనట్లు ఇటీవలి తన ఇంటర్వ్యూలో దమన్ పేర్కొన్నారు. సొంత పార్టీ నుంచే ప్రతిఘటన ఎదురైతే ఎవరైనా ఏం చేస్తారంటూ ఆమె సదరు ఇంటర్వ్యూలో తండ్రి నిస్సహాయతను కప్పిపుచ్చే యత్నం చేశారు. ‘స్ట్రిక్ట్ లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్‘ పేరిట విడుదల కానున్న ఈ పుస్తకంలో, తన తండ్రి రాత్రికి రాత్రే ఆర్థిక మంత్రిగా అవతరించిన తీరును దమన్ గొప్పగా చెప్పుకున్నారట. నాటి పీవీ హయాంలో కేంద్ర బడ్జెట్ కు కేవలం నెల సమయం ఉండగా, విత్త మంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, అయినా సమర్థవంతంగా రాణించారని వివరించారు. అయితే పదేళ్ల పాటు ప్రధానిగా ఉన్న సమయంలో మాత్రం సొంత పార్టీ నుంచే ప్రతిఘటన ఎదురైన నేపథ్యంలో పెద్దగా ఏమీ సాధించలేకపోయారని వెల్లడించారు. పీవీ హయాంలో తన తండ్రికి పూర్తి స్వేచ్ఛ లభించగా, సోనియా హయాంలో ఆ పరిస్థితి తిరగబడిందని దమన్, ఆ పుస్తకంలో వివరించినట్లు తెలుస్తోంది.