: విశాఖ స్టేడియానికి టెస్టు హోదా... ఆ వన్డే ఇక్కడేనా?


విశాఖలోని ఏసీఏ - వీడీసీఏ (ఆంధ్రా క్రికెట్‌ సంఘం - వైజాగ్‌ జిల్లా క్రికెట్‌ సంఘం) స్టేడియానికి త్వరలోనే టెస్టు హోదా దక్కనుందని ఏసీఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ... నేడు, రేపు విశాఖలో ఏసీఏ వజ్రోత్సవాలను నిర్వహిస్తున్న శుభసందర్భంలో ఈ వార్త అందరికీ ఆనందం కలిగిస్తుందని అన్నారు. బీసీసీఐ ఉన్నతాధికారులు చాలా సార్లు ఏసీఏ-వీడీసీఏ స్టేడియాన్ని సందర్శించారనీ, చిన్న చిన్న మార్పులు సూచించారని ఆయన చెప్పారు. వారు సూచించిన మార్పులకనుగుణంగా స్టేడియంను ఈ నెలాఖరుకల్లా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. దీంతో వచ్చే నెలలో ఈ స్టేడియానికి టెస్టు హోదా దక్కే అవకాశముందని గంగరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. డైమండ్‌ జూబ్లీ వేడుకలకు లక్ష్మణ్‌, కుంబ్లేను అతిథులుగా ఆహ్వానించామని గంగరాజు తెలిపారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రెండు రోజులపాటు వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. నేడు వాల్తేరు క్లబ్‌లో జరుగనున్న ఉత్సవాలకు భారత మాజీ క్రికెటర్లు వీవీఎస్‌ లక్ష్మణ్‌, జవగళ్‌ శ్రీనాథ్‌ హాజరుకానుండగా, రేపు నోవాటెల్‌ లో జరుగనున్న ఉత్సవాలకు అనిల్‌ కుంబ్లే, సందీప్‌ పాటిల్‌ హాజరవుతారని గంగరాజు చెప్పారు. కాగా, విండీస్ సిరీస్ లో భాగంగా అక్టోబర్‌ 11న భారత జట్టు వీసిఏ-వీడీసీఏ స్టేడియంలో తలపడే అవకాశం ఉందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News