: కేసీఆర్ ను చూస్తోంటే నిజాం మళ్లీ పుట్టాడనిపిస్తోంది: మోత్కుపల్లి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూస్తుంటే నిజాం మళ్లీ పుట్టాడనిపిస్తోందని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవం జరపాలని నిర్ణయించడం కేసీఆర్ భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థ మనస్తత్వానికి నిదర్శనమని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీతలతో సమానమన్న కేసీఆర్... అధికారం చేపట్టిన తరువాత మాట తప్పుతున్నారని ఆయన మండిపడ్డారు. 'మరో నెలపాటు పనిచేయను' అని కేసీఆర్ అనడం సరికాదని, ప్రజా సంరక్షణలో ప్రతిరోజూ పని చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.